సిఎం జగన్‌ ఉద్యోగ నియామకాల క్యాలెండర్‌పై సమీక్ష

పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిన సిఎం

CM Jagan
CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాష్ట్రంలో ఉద్యోగా భర్తీ క్యాలెండర్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు సూచనలు చేశారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు కోరుకుంటున్నామని, ఆయా రంగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. విద్యారంగం అభివృద్ధి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటే, స్కూళ్లలో తగినంతమంది సిబ్బంది లేకపోతే ఆ నిధులన్నీ వృథాయేనని అన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగినంత లేకపోతే స్కూళ్ల సామర్థ్యంపై ఆ ప్రభావం పడుతుందని వివరించారు. స్కూళ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలని జగన్ ఆదేశించారు. అంతేగాకుండా, పోలీసు శాఖ సామర్థ్యం తగ్గకుండా చూసుకుని, వీక్లీ ఆఫ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో ప్రాధాన్యత క్రమం అనుసరించి పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

కాగా ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్‌లో, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఏప్రిల్‌ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

ఏప్రిల్‌ 1 నాటికి 22 నియోజకవర్గాలు, మే నాటికి 46 నియోజకవర్గాలు, జూన్‌ నాటికి 70 నియోజకవర్గాలు, జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నారు. పర్యావరణానికి హాని జరగకుండా బియ్యాన్ని ప్యాక్‌ చేయడానికి వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

తాను చేసిన సూచనలపై అధికారలు ఇచ్చే నివేదికలపైన సీఎం జగన్ ఫిబ్రవరి 21న మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/