కేసీఆర్.. ముందుంది ముసళ్ల పండగ – రేవంత్ హెచ్చరిక

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు హరీష్ రావు , కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు.కేసీఆర్.. ముందుంది ముసళ్ల పండగ.. అంటూ హెచ్చరించారు. మంగళవారం సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో పర్యటించిన రేవంత్..

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, మరీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజనీతి అప్పుడు ఎక్కడ పోయిందని ఎద్దేవా చేశారు. మేం మీలా దొంగదెబ్బ తీయడం లేదు, మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు అని విరుచుకుపడ్డారు. కేసీఆర్.. ముందుంది ముసళ్ల పండగ.. అని వార్నింగ్ ఇచ్చారు.

కేసీఆర్.. మీకిక రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించండి. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చోండి. నాలుగు రోజులుగా హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గాని వాళ్లకు నొప్పి తెలియలేదు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాని చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోంది. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ధైర్యం చేస్తే అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎప్పుడు పార్టీ బలహీనపడితే.. అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పరీక్షల వాయిదాకు దమ్ముంటే ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నా చేయండని కేటీఆర్ , హరీష్ రావు లకు సవాల్ విసిరారు రేవంత్.