సీఎం ప్ర‌మోద్‌కు అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు

Pramod Sawant
Pramod Sawant


హైద‌రాబాద్: గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ ప‌నాజీలోని అసెంబ్లీలో ఇవాళ బ‌ల‌ప‌రీక్ష జ‌రిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా బుధవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  రాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌మోద్‌కు అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. మ‌నోహ‌ర్ పారిక‌ర్ మృతితో గోవాలో చోటుచేసుకున్న ప‌రిణామాల త‌ర్వాత సీఎంగా ప్ర‌మోద్ మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ప్ర‌మాణం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో సీఎం సావంత్ ఇవాళ అసెంబ్లీలో త‌న మెజారిటీ నిరూపించుకోవాల్సి వ‌చ్చింది. నలభై మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీ తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలిపింది. ఆ పార్టీకి సొంతంగా 12 మంది సభ్యులుండగా, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీకి చెందిన ముగ్గురేసి సభ్యులు, ముగ్గురు ఇండిపెండెంట్లు తమకు మద్దతునిస్తున్నారని పేర్కొంది. మాజీ సీఎం మనోహర్ పారికర్ మృతి, బీజేపీకి చెందిన ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయడంతో నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 19 మంది సభ్యుల మద్దతు లభిస్తే ప్రమోద్ సావంత్ ప్రభుత్వం బయటపడుతుంది. సభలో 14 మంది సభ్యులతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగానుండగా, ఎన్సీపీకి కూడా ఒక సభ్యుడున్నారు. అయితే ఇవాళ విశ్వ‌స‌ప‌రీక్ష‌లో సీఎం సావంత్‌కు 20 మంది ఎమ్మెల్యేలు స‌పోర్ట్ ఇచ్చారు.