9 నెలల తర్వాత రాజ్ భవన్ లో అడుగుపట్టిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 9 నెలల తర్వాత రాజ్ భవన్ లో అడుగుపెట్టారు. ఈరోజు మంగళవారం హై కోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. గత కొంతకాలంగా రాజ్ భవన్ vs ప్రగతి భవన్ అన్నట్లు వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఫైల్ ను గవర్నర్ తమిళసై రిజెక్ట్ చేసినప్పటి నుండి ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు సైతం గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించారు. గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఉన్నతాధికారులు ఎవరూ హాజరు కాలేదు. ఇక సర్కార్ తీరుపై గవర్నర్ తమిళసై పలుసార్లు ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక టీఆర్ఎస్ మంత్రులు, నేతలు సైతం బహిరంగంగానే గవర్నర్ ను విమర్శించారు. ఈ సంఘటనలతో కేసీఆర్ రాజ్ భవన్ వైపు చూడడం కూడా మానేశారు.ఇక ఈరోజు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేశారు. తెలంగాణలో సీజేగా సేవలందించిన జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సీజేగా పదోన్నతి పొందారు.