భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ హెచ్చరికలు

తెలంగాణ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి గోదావరి నదిలోకి మళ్లీ వరద నీరు వచ్చే సూచనలు ఉండటంతో.. గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సీఎం ఫోన్లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.