రేపు కొండగట్టు కు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (ఫిబ్రవరి 15) కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. వాస్తవానికి ఈరోజే సీఎం కేసీఆర్‌ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. అయితే మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి వేలాది మంది తరలివస్తారు. తన పర్యటనతో భక్తులు ఇబ్బంది పడతారని.. భావించిన సీఎం కేసీఆర్‌.. తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నారు.

బుధవారం ఉదయం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కొండగట్టుకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకొని గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి గుడి, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించనున్నారు. అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటె రీసెంట్ గా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.