మరణాలు దాచేస్తే దాగేవేనా?

కరోనాను ఆరోగ్య శ్రీ కలిపేందుకు పరీశీలిస్తాం..సిఎం

cm kcr

హైదరాబాద్‌: శాసనసభలో కరోనాపై జరిగిన చర్చలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ… కరోనా వైరస్‌ నియంత్రణకు అహోరాత్రులు శ్రమించాం.. శ్రమిస్తున్నామని కెసిఆర్‌ తెలిపారు. కరోనా వైరస్‌పై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సిఎం ప్రసంగించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమం ఆపలేదు. రైతులకు ఏం కావాలో అది ఇచ్చాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించామన్నారు. ఉద్యోగులు, పింఛన్ల జీతాల్లోనూ కోతలు విధించి ప్రజలను ఆదుకున్నాం. మద్యం దుకాణాలు కేవలం తెలంగాణలోనే తెరిచామా? కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లోనూ మద్యం దుకాణాలు తెరవలేదా? ప్రతిపక్షం మాపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రజలు కోరితేనే హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇచ్చామన్నారు. మరణాలను ఎవరైనా దాచేస్తారా? కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియదా? మరణాలు దాచేస్తే దాగేవేనా? కరోనా ప్రపంచం, దేశానికి వచ్చిన విపత్తు. కేవలం తెలంగాణలో మాత్రమే కరోనా రాలేదు.

ప్రతిపక్షం తీరు నిశితంగా పరిశీలించే వాళ్లతో మాట్లాడట్లేదు. తాను ముందు నుంచి చెబుతున్నట్లు ప్రజలు ఎవరికి వారే రక్షించుకోవాలి. ప్రజలను రక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు, సేవలు ప్రభుత్వం అందిస్తుందని సిఎం తెలిపారు. రాజకీయంగా ఎవరు ఏం మాట్లాడినా నమ్మొద్దు అని పేర్కొన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇస్తున్నాం. రాజశేఖర్‌ రెడ్డి తీసుకొచ్చిన 108 మంచి పథకం. 108 పథకం బాగుందనే కొనసాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మంచిని మంచి అని చెప్పేందుకు మాకు భేషజాలు లేవు అని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందన్నారు. ఆరోగ్య శ్రీ కంటే గొప్పదని చెప్పుకుని బిజెపి అభాసుపాలు కావొద్దన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీలో కలిపేందుకు పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య ఎక్కువ ఉందన్నారు. కరోనా మరణాల సంఖ్య జాతీయ స్థాయిలో కంటే తక్కువగా ఉందని తెలిపారు. డబ్బుల విషయంలో గతి లేని స్థితిలో రాష్ట్రం లేదు. అన్‌లాక్‌ ప్రారంభమైన తర్వాత రికవరీలో ముందంజలో ఉన్నామని సిఎం కెసిఆర్‌ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/