దేశంలో ఫ‌స‌ల్ బీమా యోజ‌న శాస్త్రీయంగా లేదు:సీఎం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వరద నష్టం నిధులు ఇంకా విడుదల చేయలేదన్నారు. పంట నష్టంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందని, గోదావరి ఉధృతి వల్లే పంటలు మునిగాయన్నారు. హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. చాలా న‌ష్టం జ‌రిగింది. వ‌ర‌ద‌ల వ‌ల్ల వివిధ ప్రాంతాల్లో రూ. 8 వేల కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని కేంద్రానికి నివేదిక పంపాం. కేంద్రం నుంచి స్పంద‌న లేదు. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ జ‌రిగితే కొంత డ‌బ్బు ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది. కేంద్రం దీనిపై స్పందించ‌డం లేదు. ప‌రిహారం కింద కేంద్రం పైసా కూడా ఇవ్వ‌లేదు. న‌ష్టం అంచ‌నాల‌పై రెండు ర‌కాల నివేదిక‌లు పంపుతారు. తాత్కాలిక అంచనాను కేంద్రానికి పంపిస్తాం. త‌క్ష‌ణ స‌హాయం కోసం తాత్కాలిక నివేదిక పంపుతారు. న‌ష్టం అంచ‌నాకు కేంద్ర బృందాన్ని పంపుతారు. కానీ ఆ బృందం ఆల‌స్యంగా వ‌చ్చి ప‌ర్య‌టిస్తోంది. అంత‌వ‌ర‌కే రెండో పంట కూడా చేతికి వ‌స్తుంది. హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు వ‌స్తే ఇంత వ‌ర‌కు కేంద్ర బృందం ప‌ర్య‌టించ‌లేదు అని సీఎం పేర్కొన్నారు.

వ్య‌వ‌సాయ రంగంపై కేంద్రం అవ‌లంభిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ఫ‌స‌ల్ బీమాపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఫ‌సల్ బీమా కానీ, మ‌న్ను బీమా కానీ, ఏద‌న్నా కానీ అదంతా వ‌ట్టి బోగ‌స్ అని ధ్వ‌జ‌మెత్తారు. మినాథ‌న్, అశోక్ గులాటి లాంటి వారు వ్య‌వ‌సాయ రంగంలో మార్పుల‌పై కేంద్రానికి రెక‌మెండ్ చేశారు. వారి నివేదిక‌ల‌ను కేంద్రం ప‌ట్టించుకోలేదు. రైతులు అప్పుల కోసం వెళ్తే ప్రీమియం క‌ట్టించుకుంటున్నారు. కేంద్రం పెట్టిన విధానాలు స‌రిగా లేవు. దేశంలో ఫ‌స‌ల్ బీమా యోజ‌న శాస్త్రీయంగా లేదు. దేశంలో ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌తో రైతుల‌కు లాభం చేకూర‌ట్లేదు. ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌పై కేంద్రానికి సూచ‌న‌లు పంపుతాం. కేంద్రాన్ని మేం విమ‌ర్శించ‌డం.. వారు మ‌మ్మ‌ల్ని విమ‌ర్శించడం స‌రికాద‌న్నారు. దేశానికి బాధ్య‌త వ‌హిస్తున్న కేంద్రానికి కొన్ని బాధ్య‌త‌లు ఉంటాయి. ఆహార ధాన్యాల కొర‌త రాకుండా శీత‌ల గోదాములు నిర్మించాలి. శీత‌ల గోదాములు నిర్మించాల్సిన బాధ్య‌త కూడా కేంద్రంపైనే ఉంటుంది. ఆహార ధాన్యాల కొర‌తే ఏర్పడితే ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి త‌ర‌లించ‌వ‌చ్చు. వ‌రి ధాన్యం మేం కొనుగోలు చేయ‌బోమ‌ని కేంద్రం చెబుతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/