అడ్డంకులు సృష్టించినా పోరాటం ఆపలేదు..: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. 9వ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందట జలదృశ్యంతో గులాబీ జెండా ఎగిరిందని, ఎన్నో అపనమ్మకాల మధ్య పార్టీ ఏర్పడిందన్నారు. స్పష్టమైన లక్ష్యంతో ముందుకు కదిలామని, సమైక్య పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో నెంబర్‌ వన్‌గా ఉన్నామని, 11.5 శాతం వృద్ధి రేటుతో నెంబర్‌వన్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని అపోహాలు సృష్టించారని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. అనేక అటుపోట్లు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగామని అన్నారు.

సిపాయిల తిరుగుబాటు విఫ‌ల‌మైంది అని అనుకుంటే దేశానికి వ‌చ్చేదా స్వాతంత్ర్యం.. రాజీలేని పోరాట‌మే విజ‌యం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వ‌చ్చి తీరుతుందిని అని నిర్ణయించుకున్నామని కేసీఆర్‌ అన్నారు. అలా అనేక ర‌కాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. స‌మైక్యవాదులు అనేక అడ్డంకులు సృష్టించినా భయపడకుండా పోరాటం సాగించామన్నారు. రాష్ట్రాన్ని సాధించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు.. ఎన్నో నిందలు వేశారు.. పడరాని ఇబ్బందులు పడ్డాము. అయినా వెనుకడుగు వేయకుండా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అని అన్నారు. అలుపెరగని పోరాటం చేసి చివ‌రికి రాజ్యస‌భ‌లో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయ‌త్నించారు. అయినా పట్టుదలతో పోరాటం సాగించి రాష్ట్రాన్ని సాధించుకున్నాము అని వివరించారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాల‌కు కొత్త బాట‌ను చూపాయి. చ‌రిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ‌కారుల‌కు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.

రాబోయే ఏడేళ్లలో చేసే ఖర్చు రూ.23 లక్షల కోట్లు. 2028 బడ్జెట్‌ రూ.4.28 లక్షల కోట్లు. 2028లో తలసరి ఆదాయం రూ.7.76 లక్షలు చేరుకుంది. కాగజ్‌నగర్‌ నుంచి గద్వాల్‌ వరకు.. జుక్కల్‌ నుంచి భద్రాచలం వరకు ప్రజా పునాది పటిష్టంగా ఉన్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రవేశపెడుతున్న పథకాలను ఏపీలోనూ అమలు చేయాలని కోరుతున్నామని, కరెంటు ఉండదని ఆ రోజు అన్న ఏపీలోనే ఇప్పుడు కరెంటు లేదు అని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/