ఇకపై ఉత్సవాలన్సీ పబ్లిక్‌ గార్డెన్స్‌లోనే!

ts cm kcr
ts cm kcr

స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలూ అక్కడే
   రాష్ట్ర అవతరణకు విద్యార్థుల తరలింపు వద్దు
   పోలీసు బలగాల కవాతులూ రద్దు
   సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పబ్లిక్‌ గార్డెన్స్‌లోని మైదానంలో నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జూబ్లీహాలు ఎదురుగా ఉన్న స్థలాన్ని దీనికోసం ఎంపిక చేశారు. ఇదేకాక స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కూడా ఇక్కడే జరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రావతరణ, గణతంత్ర వేడుకలు పరేడ్‌ మైదానంలో, స్వాతంత్య్ర వేడుకలు గోల్కొండ కోటలో జరుగుతున్నాయి. ఈ మూడు వేదికలు మారనున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ ప్రతిపాదన రాగా దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. దీనిపై సీఎం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఉత్సవాల సందర్భంగా పోలీసు సిబ్బంది కవాతులు జరపరాదని ఆదేశించారు. విద్యార్థులను ఉత్సవాలకు తీసుకొచ్చే విధానానికి స్వస్తి పలకాలన్నారు. మూడు ఉత్సవాలను ప్రజలకు, విద్యార్థులకు. పోలీసులకు యాతన లేకుండా గొప్పగా, సౌకర్యవంతంగా, నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని సీఎం చెప్పారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపైసమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కమలాకర్‌, చందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌, ఇతర ఉన్నతాధికారులు ఎస్‌.నర్సింగ్‌రావు, జనార్దన్‌రెడ్డి, అర్వింద్‌ కుమార్‌, దానకిశోర్‌, పార్థసారథి, భూపాల్‌రెడ్డి, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/