హరితహారం కోసం ‘హరిత నిధి’ ఏర్పాటు

పచ్చదనం పెంపుదలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీఎం పిలుపు

హైదరాబాద్ : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద ప్రతి ఏటా కోట్లాది మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం యొక్క ఫలితం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో చెట్లు పెరిగి కనువిందు చేస్తున్నాయి. మరోవైపు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హ‌రిత హారానికి తోడుగా తెలంగాణ హ‌రిత నిధి(తెలంగాణ గ్రీన్ ఫండ్‌) కార్య‌క్ర‌మానికి శాస‌న‌స‌భ వేదికగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిపాద‌న చేశారు. నిరంత‌రంగా హ‌రిత ఉద్య‌మాన్ని కొన‌సాగించ‌డానికి ఈ ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకొచ్చామ‌ని సీఎం తెలిపారు. హ‌రిత‌హారంపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ హ‌రిత నిధిపై ప్ర‌క‌ట‌న చేశారు.

నిన్న మ‌న రాష్ట్రంలో ప‌ని చేసే ఐఏఎస్ అధికారుల‌తో మాట్లాడాను. ప్ర‌తి నెల వారి జీతం నుంచి హ‌రిత నిధికి రూ. 100 ఇస్తామ‌ని ఒప్పుకున్నారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌ ఆఫీస‌ర్లు కూడా రూ. 100 ఇస్తామ‌ని ఒప్పుకున్నారు. వారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. న్యాక్ ద్వారా(ఆర్ అండ్ బీ) 0.1 శాతం ఇవ్వాల‌ని ప్ర‌పోజ్ చేస్తున్నాం. మ‌న రాష్ట్రంలో ప‌ని చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా ప్ర‌తి నెల రూ. 25ల చొప్పున ఇచ్చేందుకు అంగీక‌రించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్ర‌తి నెల రూ. 500 హ‌రిత నిధికి ఇవ్వాల‌ని కోరాం. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంగీక‌రించారు. మిగ‌తా ప‌క్షాల‌కు కూడా అప్పీల్ చేస్తున్నాను. వారు కూడా అంగీక‌రిస్తార‌ని అనుకుంటున్నాను.

లైసెన్సెస్ రెన్యూవ‌ల్ చేసే స‌మ‌యంలో రూ. 1000.. హ‌రిత నిధి కింద జ‌మ చేయాల‌ని కోరుతాం. భూముల అమ్మ‌కాలు, కొనుగోలు చేసేట‌ప్పుడు ప్ర‌తి రిజిస్ట్రేష‌న్ కు హ‌రిత నిధి కింద రూ. 50 క‌లెక్ట్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. విద్యార్థుల పాత్ర కూడా ఇందులో ఉండాల‌ని నిర్ణ‌యించాం. విద్యార్థులు త‌మ పాఠ‌శాల‌లు, కాలేజీల్లో ప్ర‌వేశాలు పొందే స‌మ‌యంలో.. స్కూల్ విద్యార్థులు రూ. 5, హైస్కూల్ విద్యార్థులు రూ. 15, ఇంట‌ర్ విద్యార్థులు రూ. 25, డిగ్రీ విద్యార్థులు రూ. 50, అదే విధంగా ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌దివే విద్యార్థులు రూ. 100 ఇస్తే హ‌రిత నిధికి తోడ్పాటు ఉంటుంద‌న్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని యూఎన్‌వో గుర్తించి ప్ర‌శంసించింది. ఈ గ్రీన్ ఫండ్ ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని అనుకుంటున్నాం. తెలంగాణ హ‌రిత నిధికి నిరంత‌రం నిధుల కూర్పు జ‌రిగితే అద్భుత ఫ‌లితాలు వ‌స్తాయ‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/