19 జిల్లాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు.. సీఎం కేసీఆర్‌

జూన్ 7 న ప్రారంభించాలని సీఎం కెసిఆర్ ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) సోమవారం రోజున ప్రారంభించాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు. ప్రజలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందన్నారు. పేదలకు జబ్బు చేస్తే ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. దశల వారీగా డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, తెలంగాణలో ప్రతి పౌరుడికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించి హెల్త్‌ కార్డులు ఇస్తామని, వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తామని చెప్పారు.


మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని, ఈమేరకు శనివారం వైద్య అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి , రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/