ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌పై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్య క్రమాలపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్లతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్బంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును సీఎం కేసీఆర్ అభినందించారు.

తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నాం. ప్రతీ పల్లెలో ఇవ్వాల ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయ‌ని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా చానెల్స్ ప్రసారం చేశాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు.