నేడు జార్ఖండ్ కు పర్యటనకు సీఎం కెసిఆర్

అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం..
సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌ నేడు జార్ఖండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడ అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఇదిలా ఉంటే చైనా సరిహద్దులోని గాల్వాన్‌ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్‌ బాబు ఒకరు. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి రూ. 5 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే ఇదే సమయంలో 2020 జూన్‌ 19న ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మిగతా 19 మంది సైనికులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆ ఆర్థిక సాయాన్ని అందించడానికే సీఎం జార్ఖండ్‌ వెళుతున్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లనున్న కేసీఆర్‌.. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో భేటీకానున్నారు. అనంతరం జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ముందుగా ప్రకటించిన ప్రకారం మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆదుకోవడానికి సీఎం ఆయా రాష్ట్రాలకు వెళ్లనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/