మహబూబాబాద్ కు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్

మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కురిపించారు. నేడు సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ శశాంకను సీట్‌లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు భారీ ఎత్తున నిధులు ప్రకటించారు.

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబాబాద్ కు రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ.10 లక్షల నిధి అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధులతో ఆయా సర్పంచిల ద్వారానే అభివృద్ధి పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు.

ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దాయకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రాజయ్యతోపాటు ప‌లువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిథులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.