వృక్ష‌మాత‌ తిమ్మ‌క్కకు సీఎం కేసీఆర్ సన్మానం

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో ప‌ద్మ‌శ్రీ అవార్డు సాధించిన తిమ్మ‌క్క‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స‌మావేశం

హైదరాబాద్ : వృక్ష‌మాత‌, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌కులు, ప్ర‌ముఖ పర్యావ‌ర‌ణ‌వేత్త, ప‌ద్మ శ్రీ తిమ్మ‌క్క‌ను సీఎం కెసిఆర్ ఘ‌నంగా స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. 111 ఏళ్ల వ‌య‌సులోనూ ప‌ర్యావ‌ర‌ణం, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం అలుపెర‌గ‌కుండా శ్ర‌మిస్తున్న క‌ర్ణాట‌క వాసి, ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సాలుమరద తిమ్మక్క బుధ‌వారం తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. జ‌న‌మంతా సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌ను వృక్ష‌మాత‌గా పిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన సీఎం కేసీఆర్ ఆమెనే తానే స్వ‌యంగా స‌మీక్షా స‌మావేశానికి తీసుకుని వెళ్లారు. అనంత‌రం స‌మీక్ష‌కు హాజ‌రైన మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆమెను ప‌రిచ‌యం చేసిన కేసీఆర్.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఆమె చేస్తున్న కృషిని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రస్తావించిన తిమ్మ‌క్క… కేసీఆర్ కృషిని కీర్తించారు. తెలంగాణ అభివృద్దికి కేసీఆర్ ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం సంతోషంగా ఉంద‌ని, ఈ దిశ‌గా తెలంగాణ‌ను ముందుకు తీసుకెళుతున్న కేసీఆర్‌ను ఆమె అభినందించారు. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన మేర‌కు ఎన్ని మొక్క‌లు కావాలంటే అన్నింటిని తానే అందిస్తాన‌ని ఆమె తెలిపారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా పచ్చదనం పెంపొందించే దిశగా, అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై తెలంగాణ ప్రభుత్వ కృషి, హరితహారం కార్యక్రమం, దాని స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై సాహిత్య అకాడమీ ఛైర్మన్ శ్రీ జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలి కాపీని పర్యావరణ పరిరక్షకురాలు సాలుమరద తిమ్మక్కకు కేసీఆర్‌ అందజేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/