ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

రేపటి నుండి బతుకమ్మ ఉత్సవాలు మొదలుకానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందన్నారు. కోటి మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం ప్రత్యేకంగా తయారుచేయించిన చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైన బతుకమ్మ.. ఖండాంతరాలకు విస్తరించిందని.. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని వివరించారు. ప్రజలను సుఖఃశాంతులతో, ఆయురారోగ్యాలతో దీవించాలని బతుకమ్మను ప్రార్థిస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.