సింధు మన దేశానికి గర్వకారణం

అంతర్జాతీయ విజేతలకు హైదరాబాద్‌ వేదికగా మారింది

CM KCR- Sindhu
CM KCR- Sindhu

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ను పీవీ సింధు బుధవారం ప్రగతి భవన్‌లో కలిశారు. సింధు, ఆమె తల్లిదండ్రులు విజయ, రమణ, కోచ్‌ గోపీచంద్‌, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, వీసీ సజ్జనార్‌, మహేష్‌ భగవత్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌ చంద్‌ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధు తనకు వచ్చిన పతకాన్ని సీఎంకు చూపించారు. ఆమెను సీఎం సత్కరించారు.

అనంతరం కెసిఆర్‌ రెండు షటిల్‌ రాకెట్లను సింధు బహూకరించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతు ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలవడం ద్వారా పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. భవిష్యత్తులో జరిగే పోటీల్లో ఆమె పాల్గొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేయడంతోపాటు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్‌ మారిందని తెలిపారు. సింధు క్రీడల్లో ఆణిముత్యం ప్రపంచ విజేతగా నిలవడం మనందరికీ గర్వకారణం. కఠోర సాధన, శ్రమ వల్లే ఆమె ఈ స్థాయికి చేరారు. జాతీయ క్రీడాకారులైన రమణ దంపతులు తమ కుమార్తెను గొప్పగా తీర్చిదిద్దారు. గోపీచంద్‌ మంచి శిక్షణ ఇచ్చారు. అంతర్జాతీయ విజేతలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారడం ఆహ్వానించదగ్గ పరిణామం. సింధు భవిష్యత్తులో అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలి. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలి అని
సిఎం కెసిఆర్‌ పేర్కొన్నారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/