నిఖత్‌ జరీన్‌ ను అభినందించిన సీఎం కేసీఆర్

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో నిఖత్ జరీన్ రెండవ టైటిల్‌ను గెలుచుకున్న సందర్బంగా తెలంగాణ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన ఎన్గుయెన్ తై టామ్‌పై 5-0తేడాతో గెలిచి బంగారు పతకం కైవసం చేసుకుంది.

మహిళ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్థాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మరో రెండు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత భాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు.

ఢిల్లీలో జరిగిన ఫైనల్‌లో 50 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించడంపై తెలంగాణ సీఎం అభినందనలు తెలిపారు. ‘వియత్నాంకు చెందిన బాక్సర్‌ న్యూయెన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్‌కు మరోసారి గోల్డ్‌ మెడల్‌ సాధించి పెట్టిన నిఖత్‌ జరీన్‌ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.