నా కూతుర్ని కూడా బీజేపీలోకి రమ్మన్నారు.. ఇంత కంటే ఘోరం ఉంటుందా? – కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నా కూతురిని కూడా పార్టీ మారాలని బిజెపి వాళ్లు అడిగారంటూ మండిపడ్డారు. అలాగే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మ‌ళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నిత్యం ప్ర‌జ‌ల‌తో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప్ర‌భుత్వం దృష్టికి తేవాల‌ని కేసీఆర్ సూచించారు.

బీజేపీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో నేతలంతా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. ఇటీవల టీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న ఈడీ దాడులపై స్పందించిన కేసీఆర్.. దాడులను ఊపేక్షించవద్దని నేతలకు సూచించారు. ఈడీ దాడులు చేస్తే తిరగబడాలని చెప్పారు. ఎక్కడ కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడ ధర్నాలు చేయండని తెలిపారు. స‌ర్వేల‌న్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికార‌మ‌ని తేల్చిచెప్పారు. మునుగోడు త‌ర‌హాలో ప‌టిష్ట ఎన్నిక‌ల వ్యూహం త‌యారు చేయాల‌ని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా ప‌ని చేయాలనీ ఆదేశించారు.