విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లను పంపిణీ చేసిన సిఎం జగన్‌

రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి

YouTube video
Hon’ble CM will be distributing FREE TABS to 8th class Students and Teachers of Govt & Aided Schools

బాపట్ల: సిఎం జగన్‌ తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ ల పంపిణీని జగన్ బుధవారం ప్రారంభించారు. బాపట్ల జిల్లా చండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తన పుట్టిన రోజు గురించి కాదు, పుట్టిన ప్రతి బిడ్డ గురించి ఆలోచిస్తున్నానని జగన్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,564 మంది విద్యార్థులకు, 57,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,703 పాఠశాలల్లో వారం రోజుల్లో ట్యాబ్ ల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు.

కేవలం తన పుట్టిన రోజున అని కాకుండా ఇకపై ప్రతీ ఏటా ట్యాబ్ ల పంపిణీ పథకం కొనసాగుతుందని తెలిపారు. 8వ తరగతిలోకి అడుగు పెట్టే ప్రతీ విద్యార్థికి ట్యాబ్ అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రతీ ట్యాబ్ లో బైజూస్ కంటెంట్ ఉంటుందని తెలిపారు. ఇంగ్లీష్, తెలుగు సహా 8 భాషల్లో పాఠాలు వినవచ్చన్నారు. 8, 9వ తరగతి గదుల్లో చెప్పే పాఠాలు ముందుగానే లోడ్ చేసి ఉంటాయన్నారు. దాంతో, నెట్ తో అవసరం లేకుండా ట్యాబ్ లో కంటెంట్ ను చూడవచ్చని వెల్లడించారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు మరింత సులువుగా అర్థమయ్యేలా ట్యాబ్ లు ఉపయోగపడుతాయని చెప్పారు. వీటికి మూడు సంవత్సరాల వ్యారంటీ ఉంటుందన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా గ్రామ సచివాలయాల్లో ఇస్తే వారంలో రిపేర్ చేయిస్తారని, లేదంటే కొత్తది అందజేస్తారని సీఎం జగన్ వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తల్లిదండ్రుల కష్టాలను ఎన్నో చూశానని జగన్ అన్నారు. సమాజంలో అన్ని అంతరాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. పేదల బతుకులు మారాలంటే వాళ్ల తల రాత మారాలని అన్నారు. అది జరగాలంటే చదువు ఒక్కటే మార్గం అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/