బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్‌ సమావేశం

పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ

అమరావతి : సీఎం జగన్ బద్వేల్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్ సీపీ నేతలతో ఇవాళ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కడప జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు.

బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మంగళవారమే ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 8 నుంచి నామినేష్లను స్వీకరించనున్నారు. నవంబర్ 2న ఫలితాన్ని వెల్లడిస్తారు. కాగా, టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/