అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం

తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం

ఏలూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు.

ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్-4లో గత రాత్రి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను తొలుత నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని అక్కడి నుంచి విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/