రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: సిఎం జగన్
‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసిన సిఎం జగన్

కర్నూలుః రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా, రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని సిఎం జగన్ పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని, హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే చేసుకుంటూ వస్తున్నామని ఆయన అన్నారు. రైతు భరోసా పీఎం కిసాన్ నిధుల జమ సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మీ ప్రేమానురాగాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం ఇప్పుడు ఉందని, మీ బిడ్డ ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలబడుతుందని చెప్పారు.
రైతులు ఇబ్బంది పడకూడదని పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అన్నదాతలకు భరోసా కల్పించేలా ఒక్క బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలోనే సాయాన్ని జమ చేస్తున్నామని వివరించారు. ఐదో ఏడాది తొలి విడత నిధులను ఈ రోజు విడుదల చేస్తున్నామని చెప్పారు. దీంతో 52,30,939 మంది రైతన్నలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతీ రైతు ఖాతాలో జమ చేసిన మొత్తం రూ.61,500 లకు చేరిందని సీఎం వివరించారు. నాలుగేళ్లుగా 22.70 లక్షల మంది రైతు కుటుంబాలకు నేరుగా వారి ఖాతాల్లో రూ.1,965 కోట్లు జమచేసినట్లు తెలిపారు.