లోన్ యాప్ ఆగడాలపై సీఎం జగన్ సీరియస్..

రోజు రోజుకు లోన్ యాప్స్ ఆగడాలు ఎక్కువైపోతుండడం..వారి ఆగడాలను తట్టుకోలేక పదుల సంఖ్యలో మరణించడంతో సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈసంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి లేని లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈవిషయంలో కఠినంగా వ్యవహరించాలని నేరుగా సీఏం జగన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇక నుంచి రాష్ట్రంలో లోన్ యాప్ ఆగడాల వల్ల ఎవరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకూడదన్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నగరంలోని శాంతినగర్‌లో ఉంటున్న వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్, రమ్యలక్ష్మి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్ రుణయాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పెడతామని హెచ్చరించారు.
ఈ బాధలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో దుర్గారావు పది రోజుల కిందట ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌గా చేరి అదనపు సంపాదన కోసం ప్రయత్నించారు. ఈలోగా అసభ్యకరంగా ఉన్న ఓ చిత్రానికి రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్ చేసి యాప్‌ల నిర్వాహకులు వాట్సాప్‌లో బెదిరించారు. రెండు రోజుల వ్యవధిలో పూర్తి రుణాన్ని వడ్డీతోసహా చెల్లించకుంటే ఈ చిత్రంతోపాటు అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని హెచ్చరించారు. దాంతో గుండెపగిలిన దంపతులు ..గోదావరి గట్టున ఉన్న ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు.
మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో బావ రాజేష్‌కు రమ్యలక్ష్మి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కాల్ కట్ చేశారు. వారు లాడ్జి వద్దకు వచ్చేసరికి దుర్గారావు దంపతులు గదిలో విష రసాయనం తాగి విగత జీవులుగా పడి ఉన్నారు. వారిని వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గంట వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు వదిలినట్లు వైద్యులు ధ్రువీకరించారు.