దిలీప్‌కుమార్‌ మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం

అమరావతి : సీఎం జగన్ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దిలీప్‌ కుమార్‌ మృతి భారతీయన సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’అని సీఎం జగన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్‌ కుమార్‌ (98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నారు. దశాబ్దాల పాటు హిందీ చలనచిత్ర రంగాన్ని ఏలారు. భారతీయ చలన చిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్‌గా చెప్పుకొనే తరానికి చెందిన నటుడాయన. దేవదాస్, మొఘల్-ఎ-ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి వంటి మైల్ స్టోన్స్ వంటి సినిమాల్లో నటించారు. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సన్మానించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/