రెండో రోజు ప్లీనరీ సమావేశలు..వైఎస్‌ఆర్‌సిపి జీవితకాల అధ్యకుడిగా జగన్‌ ఎన్నిక

జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన జగన్

CM Jagan Mohan Reddy elected YSRCP’s lifetime president

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా.. రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎన్నికయ్యారు. ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ తీర్మానంతో పాటు పారదర్శక పాలన-సామాజిక సాధికారత, పరిశ్రమలు-ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం తదితర అంశాలపై తీర్మానాలపై కూడా చర్చించి వాటిని ఆమోదించారు. ఈ తీర్మానాలను ఆమోదించిన తర్వాత పార్టీ అధినేత జగన్ ముగింపు ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్లీనరీలో ఆత్మీయుల సునామీ కనిపిస్తోందని చెప్పారు. దశాబ్ద కాలం పాటు కష్టాలను భరించి, అవమానాలను తట్టుకుని, త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడ ఉందని అన్నారు. తన కష్టంతో పాటు మీ త్యాగాలు, శ్రమ వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. పార్టీ భావాలు, బాధ్యతలను భుజాలపై మోస్తున్న నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవే చేస్తున్నాం. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని అన్నారాయన.

నాన్న మరణ వార్త విని సుమారు 700 మంది చనిపోయారు. వారందరి కుటుంబాలను పరామర్శించడం నా బాధ్యతగా భావించా. నాపై కాంగ్రెస్‌, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయి. నాపై ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కుట్రలకు, తప్పుడు కేసులకు లొంగేవాడు కాదు జగన్‌. నన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఆనాడూ చంద్రబాబు మన పార్టీలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. 2014లో 23 ఎమ్మెల్యేలను కొన్న పార్టీకి.. 2019లో అన్నే సీట్లు వచ్చాయి అని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. ఒక్క ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరిందని గుర్తు చేసుకున్నారు. నిండు మనసుతో మీ అందరికీ సెల్యూట్‌ చేస్తున్నా అని ప్రజాభివాదం చేశారు సీఎం జగన్‌.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/