నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

అమరావతి: నేడు సీఎం జగన్ పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ సందర్బంగా పీఆర్సీపై చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఫిట్ మెంట్ ను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. పీఆర్సీ వ్యవహారాన్ని ఇక నాన్చకుండా తేల్చేయాలని సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు నిన్న ఉద్యోగులకు పీఆర్సీ అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు. ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై చర్చలు జరిపారు. ఫిట్ మెంట్ ఎంత శాతం ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయంపై సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే.. ఇప్పుడున్న 27% ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా ఉండకూడదని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్ వచ్చేలా ప్రభుత్వం చూడాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం 30% ఫిట్‌మెంట్ ప్రకటించింది. డిసెంబరు చివరి వారంలో ఉద్యోగుల సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు 14.29% అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చే జీతాల కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/