ఏపిలో నేటి నుండి గోరుముద్ద పథకం అమలు

పిల్లలకు పోషకాహారం అందించేందుకే ఈ ప్రయత్నం

CM jagan

అమరావతిః ఈరోజు నుండి ఏపిలో చదువుకునే పిల్లలకు శారీరక ఆరోగ్యం కోసం గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నామని సిఎం జగన్‌ తెలిపారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు రాగి జావను అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రపంచంతో పోటీపడి నెగ్గేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇందుకోసం అనేక పథకాలను, కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.

విద్యాదీవెనతో పాటు విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారంగా రాగి జావను చేర్చినట్లు వివరించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావను అందిస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.