ప్రధానికి మోడీకి అభినందనలు తెలిపిన సీఎం జగన్

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఇటీవల నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీకి జగన్ అభినందనలు తెలిపారు. తాము మహత్తర ఘట్టానికి హాజరవుతామని ట్వీట్ ద్వారా వెల్లడించారు.

‘కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోడీకి అభినందనలు. పార్లమెంటు అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. దేశ ఆత్మను పార్లమెంట్ ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి పార్లమెంట్ భవనం ప్రారంభాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు. రాజకీయంగా పార్టీలు తమ అభిప్రాయాలను పక్కనపెట్టి, ఈ అపురూప ఘట్టానికి హాజరు కావాలని కోరుతున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రక కార్యక్రమానికి మా పార్టీ (వైస్సార్సీపీ) హాజరవుతుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

కాగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం గురించి రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని.. తాము ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని 19 విపక్ష పార్టీలు బుధవారం స్పష్టం చేశాయి.