మేక‌పాటి హ‌ఠాన్మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను: సీఎం జ‌గ‌న్

చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారు: బొత్స‌
మేక‌పాటి కుటుంబానికి ప్రగాఢ‌ సానుభూతి: విజ‌య‌సాయిరెడ్డి

అమరావతి : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల పలువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న కార్యక్ర‌మాల‌న్నింటినీ వాయిదా వేసుకున్నారు. ఐటీ మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌతం రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని జ‌గ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డార‌ని అన్నారు. తాను సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందని చెప్పారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ‌ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వైస్సార్సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/