తిరుప‌తి రుయా ఆసుప‌త్రి అంబులెన్స్ ల దందాపై స్పందిచిన జ‌గ‌న్

ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడదన్న జ‌గ‌న్‌

అమరావతి: తిరుప‌తి రుయా ఆసుప‌త్రిలో చ‌నిపోయిన బాలుడి మృత‌దేహాన్ని త‌ర‌లించే విష‌యంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా సాగించిన దురాగ‌తంపై సీఎం జ‌గ‌న్ తాజాగా స్పందించారు. సోమ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. మంగ‌ళ‌వార‌మే రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ సీఎంను క‌లిసి ఘ‌ట‌న గురించి వివ‌రించారు. అంతేకాకుండా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుడిగా గుర్తిస్తూ ఆసుప‌త్రి సీఎస్ఆర్ఎంవోను స‌స్పెండ్ చేసిన ప్ర‌భుత్వం ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసు‌లు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌ను గుర్తించి వారిపై కేసులు న‌మోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ స్పందించారు. మరోమారు ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడదని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్దారు. ఇలాంటి చిన్న‌ఘ‌ట‌న‌లే మొత్తం వ్య‌వ‌స్థ‌నే అప్ర‌తిష్ట పాలు చేస్తాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/