ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ ఈరోజు బుధువారం అంత బిజీ బిజీ గా గడిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విజయవాడ లో ఏర్పాటు చేసిన బిసి సభ లో పాల్గొన్న ఆయన..ఆ తర్వాత సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె సౌజన్య వివాహ వేడుకకు హాజరయ్యారు. కనపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్ లో ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వధూవరులు సౌజన్య, డాక్టర్ శ్రావణ్ కుమార్ లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్.

ఈ వివాహ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం జగన్ తాడేపల్లి తిరుగు పయనమయ్యారు. అంతకుముందు కనుపర్తిపాడులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

ఇక “జయహో బీసీ – వెనుకబడిన కులాలే వెన్నెముక” అన్న నినాదంతో విజయవాడలో వైస్సార్సీపీ పార్టీ తలపెట్టిన బీసీల మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఓ పండుగ వాతావరణం కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది బీసీ ప్రజాప్రతినిధులతో బెజవాడలో వైస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. జయహో బీసీ నినాదం.. విజయవాడలో హోరెత్తింది. చిత్తూరు నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని జిల్లాల నుంచి దాదాపు 85 వేల మంది బీసీ ప్రతినిధులు ఈ సభకు హాజరై జయహో బీసీ- జయహో జగనన్న అంటూ నినదించారు.