డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం సీఎం చంద్రబాబు

డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈరోజు సచివాలయంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు చాంబర్ లోని ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ … ఆ గుర్తుకు వన్నె తీసుకువచ్చారంటూ చంద్రబాబును పవన్ కొనియాడారు. అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు సమావేశమయ్యారు.

అంతకు ముందు సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద పవన్ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. గజమాలతో జనసేనానిని సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం గ్రామం వరకు రోడ్డుపై పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితుడైన పవన్ కళ్యాణ్ రేపు (జూన్ 19) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈరోజు విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్… వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి బయల్దేరారు.