హుజురాబాద్ ఉప ఎన్నిక : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీలో ఉద్రిక్తత

హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బరిలో ఉన్న అన్ని పార్టీ లు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసాయి. తెరాస పార్టీ గెలుపు కోసం ముందు నుండి నియోజకవర్గం లో హరీష్ రావు పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నాడు. మొన్నటి వరకు బిజెపి నుండి ఈటెల మాత్రమే ప్రచారం చేయగా..ఇక ఇప్పుడు బిజెపి నేతలంతా పర్యటిస్తూ ఈటెల గెలుపుకోసం కష్టపడుతున్నారు.

ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడ్‌లో కిషన్ రెడ్డి ర్యాలీ జరుగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఎదురుపడడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ప్రత్యర్థులపైకి దూసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన పోలీసులు ఇరువర్గాలను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికార టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులను లెక్కచేయకుండా నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ఓటమి భయంతోనే గులాబీ పార్టీ నేతలు ర్యాలీని అడ్డుకున్నారని ఆయన అన్నారు.

కేసీఆర్ కుటుంబానికి అబద్ధాల ఆడటమే తెలుసని, అబద్ధాలు పుట్టి ఆ తర్వాత వీళ్లు పుట్టారని ఆయన ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌‌లోని ప్రతి దళిత బిడ్డ ఈటలకే ఓటేయాలని, దళిత బంధు పథకం రావడానికి కారణం ఈటల రాజేందర్ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ పథకానికి ఈటల రాజేందర్ హుజురాబాద్ పథకంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.