పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. రేపటి తో ప్రచారానికి ముగుస్తుంది. ఈ క్రమంలో బిజెపి – టిఆర్ఎస్ మధ్య మాటల తూటాలు మాత్రమే కాదు ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నాంపల్లి మండలంలోని పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో బీజేపీ ర్యాలీ తీస్తుండగా టీఆర్ఎస్ కవ్వింపులకు పాల్పడిందని బిజెపి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకోగా.. పోలీసులు చేరుకొని వారిని అదుపు చేసారు. పసునూరు గ్రామానికి టీఆర్ఎస్ ఇంచార్జ్గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.

ఇక నిన్న బంగారిగడ్డ లో జరిగిన కేసీఆర్ సభ భారీ సక్సెస్ అయ్యింది. సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సభలో కేసీఆర్ బిజెపి తీరు ఫై , ఎమ్మెల్యే ల కొనుగోలు ఫై నిప్పులు చెరిగారు. దేశ రాజకీయాలను మలుపుతిప్పే సువర్ణావకాశం మునుగోడుకు వచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించి బీఆర్‌ఎస్‌కు పునాదిరాయి వెయ్యాలని ఓటర్లను కేసీఆర్ కోరారు. ఢిల్లీ నుంచి వచ్చి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి, దొరికిపోయినోళ్లు ఇప్పుడు జైల్ల్లో ఉన్నరు. ఒక్క మాట సూచన ప్రాయంగా చెప్తున్నా. నిన్న మొన్న మీరు టీవీల్లో చూసింది తక్కువే. దొరికింది ఇంకా ఉన్నది. ఢిల్లీ పీఠమే దిమ్మదిరిగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అవన్నీ బయట పడుతయి. ఎవడో ఒకడు తలకుమాసినోడు తడి బట్టలతోని ప్రమాణం చేస్తవా? అంటడు. ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తవా? అంటున్నడు. దొంగలు దొరికి జైల్లో ఉంటే, తడిబట్టల ప్రమాణం ఏం చేస్తది? అంటూ నిప్పులు చెరిగారు.