రేవంత్‌కు నోటీసులు జారీచేసిన సివిల్ కోర్టు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కి సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ సోమవారం సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన సివిల్ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీచేసింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ రెడ్డికి ఇంజెక్షన్ ఆర్డర్ చేసింది.

ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిటీ సివిల్ కోర్టు.. తదుపరి విచారణను అక్టోబరు 20కు వాయిదా వేసింది. అంతకు ముందు కేటీఆర్ తరుపు లాయర్ వాదిస్తూ.. ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసులోకి మంత్రి కేటీఆర్‌ను లాగి, పరువుకు భంగం కలిగించారన్నారు. ఇందుకు పరువు నష్టం కింద రూ.కోటి చెల్లించేలా ఆదేశించాలని కోరారు. అలాగే, ఇలాంటి ఆరోపణలు మరోసారి చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కేటీఆర్ తరఫున లాయర్ అన్నారు.

ఇక రేవంత్ ..ఇటీవల కేటీఆర్‌కు డ్ర‌గ్స్ కేసుతో సంబంధం ఉంద‌ని, ఆయ‌న డ్ర‌గ్ టెస్ట్ చేయించుకోవాల‌ని వైట్ చాలెంజ్ పేరుతో స‌వాల్ విసిరారు. ఆ స‌వాల్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు వెళ్లివ‌చ్చిన వ్య‌క్తితో క‌లిసి డ్ర‌గ్ టెస్టుకు వెళ్లి త‌న స్థాయిని దిగ‌జార్చుకోలేన‌ని, రాహుల్‌గాంధీ డ్ర‌గ్ టెస్టుకు సిద్ద‌మా..? అని ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే మంత్రి కేటీఆర్ రేవంత్‌రెడ్డిపై ప‌రువున‌ష్టం దావా కూడా వేశారు.