ఎడిటర్ గౌతమ్ రాజు మృతి ఫై మెగా బ్రదర్స్ ఎమోషనల్ ట్వీట్స్

ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ సంతాపాన్ని తెలియజేయగా…తాజాగా మెగా బ్రదర్స్ మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు తన సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసారు.

గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్ ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో వారి ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెలకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్ అంత వేగం. నా “చట్టానికి కళ్ళు లేవు” సినిమా నుంచి “ఖైదీ నెంబర్ 150″ వరకు ఎన్నో చిత్రాలకు వర్క్ చేశారు. గౌతమ్ రాజు మరణం వ్యక్తిగతంగా నాకు, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

శ్రీ గౌతమ్ రాజు గారు మృతి విచారకరం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన శ్రీ గౌతమ్ రాజు గారు కన్నుమూయడం విచారకరం. ఎడిటర్ గా వందల చిత్రాలకు పని చేసిన అనుభవశాలి ఆయన. ఆ విభాగంలో సాంకేతికంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను అందిపుచ్చుకొన్నారు. నేను నటించిన ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘గబ్బర్ సింగ్’, ‘గోపాల గోపాల’ చిత్రాలకు శ్రీ గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అంటూ పవన్ ట్వీట్ చేయడం జరిగింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్ రాజు.. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

గౌతమ్ రాజు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. సుమారు 800 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు చేసారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు. ‘ఆది’, ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’, ‘అదుర్స్‌’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘కాటమరాయుడు’ తదితర ప్రాజెక్ట్‌లతో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో గౌతమ్‌రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ , ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.