చిత్రసీమను ఇబ్బంది పెట్టొదంటూ జగన్ కు చిరు రిక్వెస్ట్

ఇండస్ట్రీలో అందరూ భారీ రెమ్యూనరేషన్లు తీసుకోవట్లేదని, నలుగురైదుగురు మాత్రమే హయ్యస్ట్‌ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని..ఆ నలుగుర్ని మాత్రమే చూసి చిత్రసీమ ను ఇబ్బంది పెట్టొదంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏ ప్ర‌కృతి విప‌త్తు వ‌చ్చినా ఆదుకోవ‌డానికి ముందుగా స్పందించేది సినీ ప‌రిశ్ర‌మేన‌ని, కానీ క‌రోనా వ‌ల్ల ఆ సినీ ప‌రిశ్ర‌మే సంక్షోభంలో చిక్కుకుంద‌ని చిరంజీవి అన్నారు. నిర్మాణ వ్య‌యం పెరిగిపోయింద‌ని, స‌ర్దుబాటు ధోర‌ణికి చాన్స్ లేద‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితుల్లో సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు చిరంజీవి విజ్ఞ‌ప్తి చేశారు.

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన సినిమా ల‌వ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీ సాధక బాధకాలను ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సినిమాలు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురైదుగురి గురించి అందర్నీ ఇబ్బంది పెట్టొద్దని సూచించారు చిరంజీవి.

హీరోలు, డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారని అనుకోవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీ విషయంలో కనికరం చూపాలని ఏపీ సీఎంను కోరుతున్నానని అన్నారు చిరంజీవి. మా సమస్యలకు పరిష్కారం చూపాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేడుకుంటున్నట్లు చెప్పారు చిరంజీవి. ఇబ్బందుల్లో ఉన్న ఇండస్ట్రీని ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు.