అల్లూరి వేడుకల్లో పాలుపంచుకోవడం ఫై చిరంజీవి ట్వీట్

అల్లూరి125 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్య క్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా చిరంజీవి కార్యక్రమానికి హాజరవ్వడం పట్ల ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పిక్స్ షేర్ చేసారు. మొత్తం నాలుగు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేసిన చిరంజీవి… అల్లూరి విగ్రహావిష్కరణకు కేంద్రం తనను ఆహ్వానించడం, ఆ కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక నాలుగు ఫొటోల్లో ఒకటి మోదీ తనను ఆత్మీయంగా పలకరిస్తున్న ఫొటో కాగా… మరొకటి జగన్ తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోగా ఉంది. మరో ఫొటోలో కూర్చున్న మోదీకి జగన్ చూస్తుండగా చిరు నమస్కరిస్తున్నారు. చివరి ఫొటోగా వేదికపై ఉన్న వారంతా నిలబడినదిగా ఉంది.
ఇక ఈ సభలో మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టి ఆకట్టుకున్నారు. అల్లూరి జయంతి రోజు అందరం కలుసుకోవడం అదృష్టమన్న మోడీ.. గొప్ప స్వాంతంత్య్ర సమరయోధుడి కుటుంబ సభ్యులను కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యిందని.. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోడీ వివరించారు. ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురిటిగడ్డగా మోడీ వర్ణించారు. ఇక్కడి బలిదానాల చరిత్ర, ఆదివాసీల వీరగాథలు ప్రేరణ నింపుతాయన్నారు. మహోన్నతమైన ఈ పుణ్యభూమికి నమస్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ గడ్డపై పుట్టిన అల్లూరి.. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు.