గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అభిమానులను కట్టిపడేసారు. చాలా తృప్తిగా ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. విజయాలు, అపజయాలు మన చేతుల్లో ఉండవని మనకు తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయానే చిన్న బాధ ఉంది. దానికి సమాధానం.. నాకు ఊరట.. ఈ గాడ్ ఫాదర్. ఈ సినిమా ఓ నిశ్శబ్ద విస్పోటనం. నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఆ నేల తడుస్తుంది. నాకు ఈ రోజు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పులివెందులలో పొలికల్ క్యాంపెన్‌ చేసిన టైమ్‌లో.. ఇంద్ర సినిమాలో సాంగ్ చేసినప్పుడు వర్షం వచ్చింది. ఇవన్నీ ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. థ్యాంక్యూ వరుణా దేవా..ఈ రాయలసీమలో వర్షాలు పడక నేల నెర్రులు చాస్తుంటే.. చిరంజీవి వస్తుంటే వర్షం వస్తుంది. ఈ సెంటిమెంట్ మళ్లీ పునరావృతం కావడం నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను. ఇంత వర్షంలోనూ మీరు ఎవరు వెనక్కి తగ్గడం లేదు. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.

మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే , ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధువారం( సెప్టెంబర్ 28న) అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా నిర్వహించారు.

ఈ వేడుకలో చిరంజీవి చాలా ఆసక్తికరంగా మాట్లాడి అభిమానులను కట్టిపడేసారు. ఈవెంట్ పూర్తికావొస్తున్న సమయంలో జోరు వాన అందుకుంది. అయినప్పటికీ అభిమానులు కదలకుండా..వర్షంలోనే చిరంజీవి స్పీచ్ వింటూ ఉన్నారు. చిరంజీవి వర్షంలో తడుస్తూ స్పీచ్ ఇచ్చారు. మూవీలో నటీనటులు, సాంకేతిక బృందం గురించి చెప్పారు. తాను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఆ నేల తడుస్తుందన్నారు. ఈ వేడుక సమయంలో వర్షం రావడం ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నానని అన్నారు. రామ్ చరణ్ వల్లే తాను ఈ సినిమా చేశానని అన్నారు.

ఈ రోజు ఉదయం ఓ విషదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి. సోదరుడు మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరా దేవి గారు కాలం చేశారు. ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది. కృష్ణ గారు, మహేష్ బాబుకు, ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని గాడ్ ఫాదర్ స్టేజ్ మీద నుంచి తెలియజేస్తున్నాను. ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ రాయలసీమలో వర్షాలు పడక నేల నెర్రులు చాస్తుంటే.. చిరంజీవి వస్తుంటే వర్షం వస్తుంది. ఈ సెంటిమెంట్ మళ్లీ పునరావృతం కావడం నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను. ఇంత వర్షంలోనూ మీరు ఎవరు వెనక్కి తగ్గడం లేదు. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ అభిమానులకు థాంక్స్ చెప్పుకున్నారు.

సినిమాలోని నటి నటుల విషయానికి వస్తే.. నయనతారకు గాడ్ ఫాదర్ మూవీ క్యారెక్టర్ చెప్పగానే ఒప్పుకున్నారు. ఆమె ఒప్పుకోవడమే సినిమా విజయానికి తొలి మెట్టు అయింది. ఆమె పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఈ పాత్ర పోషించడం ఓ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్‌ను అద్భుతంగా పంచింది నయనతార. ఈ మూవీలో మరో కీలక పాత్ర సత్యదేవ్. నన్ను ఎదురొడ్డి నిలిచే క్యారెక్టర్ ఇది. సత్యదేవ్ ఈ పాత్రకు న్యాయం చేస్తాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత అతని గురించి మీరు చెప్తారు. అతనిలో మంచి యాక్టర్ ఉన్నాడని గుర్తించింది మొదట నేను. మనం చూస్తుండగానే అతను సూపర్ స్టార్‌గా ఎదగడం మీరందరూ చూస్తారు. మురళీశర్మ, రావు రమేష్, సునీల్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ చాలా మంచి క్యారెక్టర్లు చేశారు. ఈ మూవీలో ఓ యూట్యూబర్ పాత్రలో పూరీ జగన్నాథ్ నటించారు..’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

స్పీచ్ చివర్లో యాంకర్ రవి సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమని చిరంజీవి ని కోరగా.. ‘ప్రతి ఒక్కరు రోడ్డు కాంట్రాక్టులు.. ఇసుక కాంట్రాక్టులు.. కొండ కాంట్రాక్టులు.. నీళ్ల కాంట్రాక్టులు.. నేల కాంట్రాక్టులు.. మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన.. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం.. తప్పు చేయాలంటే భయం తప్ప మీ మనసులో ఏది ఉండకూడదు. ఏదైనా జరగకూడదని జరిగిందో.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబడ్దార్’ అంటూ పవర్ డైలాగ్ చెప్పి మెగాస్టార్ అందరిని కట్టిపడేసాడు.

‘నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు లేరని అంటారు. కానీ.. ఇప్పుడంటున్నాను.. నా వెనుకలా ఇన్ని లక్షలమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నా మనసు అంతరాంతరాల్లో నుంచి వచ్చి వస్తున్న మాట. అందరికీ థ్యాంక్యూ..’ అంటూ ఫ్యాన్స్ గురించి గొప్పగా చెప్పారు.