ఆ పదవికి రాజీనామా చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో చిరంజీవి చాలా కొత్త లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు. కాగా గతంలో రాజకీయాల్లో ప్రత్యక్షంగా చురుగ్గా ఉన్న చిరంజీవి, గతకొంత కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓ కీలక పదవికి రాజీనామా చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

మా అసోసియేషన్‌లోని క్రమశిక్షణ విభాగంలో కీలక పదవిలో చిరంజీవి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 నుండి ఆయన ఈ పదవిలో ఉన్నారు. తాజాగా ఆయన ఈ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూడా బలమైనదే ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మా అసోసియేషన్ రెండు విభాగాలుగా విడిపోవడమే చిరు రాజీనామాకు కారణంగా తెలుస్తోంది. కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, చిరంజీవి, జయసుధలు అధ్యక్షులుగా ఒక విభాగం ఉండగా, మరో విభాగానికి సీనియర్ నటుడు నరేష్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

దీంతో ‘మా’లో రెండు విభాగాలు ఏర్పడటం, పరస్పరం ఒక విభాగానికి మరో విభాగంతో గొడవలు తలెత్తడమే కాకుండా, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా మా నుండి చిరంజీవి రాజీనామా చేశాడనే వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.