వేదాలం రీమేక్‌కు డేట్ ఫిక్స్ చేసిన చిరు

వేదాలం రీమేక్‌కు డేట్ ఫిక్స్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే సగం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఆచార్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఆచార్య చిత్రం పూర్తిగాక ముందే మెగాస్టార్ తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతలను మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌కు అప్పగించాడు చిరు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘వేదాలం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చిరు ఎప్పటినుండో అనుకుంటున్నాడు. దీంతో మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు ముందుకు రావడంతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిరు ఆసక్తిని చూపుతున్నాడు.

ఇక ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసేందుకు చిరు ఓ డేట్‌ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. వేదాలం రీమేక్ చిత్రాన్ని జనవరి 18న గ్రాండ్ లాంఛ్ చేసేందుకు చిరు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోపు ఆచార్య చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఇక మెహర్ రమేష్ కూడా బౌండ్ స్క్రిప్టుతో రెడీగా ఉండాలని చిరు ఆర్డర్ వేశాడట. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన వేదాలం చిత్ర రీమేక్‌కు పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్న చిరు, ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.