తాను ఇండస్ట్రీ పెద్ద కాదంటూ మరోసారి క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi
Chiranjeevi

దాసరి మరణం తర్వాత ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు అంటూ ఎవ్వరు లేకుండాపోయారు. మెగాస్టార్ చిరంజీవి ఆ బాధ్యతలు తీసుకోవాలంటూ సినీ ప్రముఖులు కోరుతున్నప్పటికీ..చిరు మాత్రం తాను ఇండస్ట్రీ పెద్ద కాదని..కేవలం నటుడు మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఇండస్ట్రీ కి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా..సినీ కార్మికులు ఎలాంటి కష్టాల్లో ఉన్న నేనున్నానంటూ ముందుకు వస్తూ చిరు సాయం అందిస్తూనే ఉన్నారు.

ఇప్పటికే పలుమార్లు తాను ఇండస్ట్రీ పెద్ద కాదంటూ చెప్పుకొచ్చిన చిరు..తాజాగా మరోసారి అదే విషయాన్నీ తెలిపారు. గురువారం హైదరాబాద్ చిత్రపురి కాలనీ నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ లో సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరుగింది. దాదాపు 22 ఏళ్ళ సినీ కార్మికుల కల ఈరోజు నిజమైందన్నారు. సినీ కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

“అనిల్ , దొరై ఎంతో కష్టపడి గృహా సముదాయాన్ని పూర్తి చేశారు. సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలుగు సినీ కార్మికులకు గృహాసముదాయం ఉంది. చిత్రపురి కాలనీలో అవకతవకల గురించి నేను మాట్లాడను. ఎంతో నీతి నిజాయతీతో వల్లభనేని అనిల్ కమిటీ గృహా సముదాయాన్ని పూర్తి చేసింది. ఇక సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దలు ప్రతిసారి తనను పెద్ద అంటుంటారని.. నిజానికి నా కంటే చిన్నవాళ్లు అనిపించుకోవడం కోసం నన్ను పెద్దను చేస్తున్నారని నవ్వుకుంటూ చెప్పారు మెగాస్టార్. ఇక పెద్దరికం అనుభవించాలనే కోరిక తనకు లేదని, అవసరమైనప్పుడు సినీ కార్మికులకు తప్పకుండా భుజం కాస్తానని” హామీ ఇచ్చాడు.