అల్లు రామలింగయ్య బహుముఖ ప్రఙ్ఞాశాలి

అల్లు రామలింగయ్యతో నాకు తొలి పరిచయం ఎక్కడ జరిగిందంటే..: చిరంజీవి

రాజమండ్రి : ప్రముఖ సినీ నటుడు, దివంగత అల్లు రామలింగయ్య విగ్రహాన్ని రాజమండ్రిలో చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య హోమియో ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నటుడిగా తనకు జన్మనిచ్చింది రాజమండ్రి అని చెప్పారు. తాను నటించిన రెండు, మూడు సినిమాలు రాజమండ్రి చుట్టుపక్కల షూటింగులు జరుపుకున్నాయని తెలిపారు. ‘మన ఊరి పాండవులు’ సినిమా షూటింగ్ సందర్భంగా అల్లు రామలింగయ్యతో తనకు తొలిసారి పరిచయం ఏర్పడిందని తెలిపారు. ‘అల్లు రామలింగయ్యకు, నాకు గురు శిష్యుల అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య బహుముఖ ప్రఙ్ఞాశాలి. నటుడిగా కొనసాగుతూనే ఆయన హోమియోపతిపై పట్టు సాధించారు. నిత్య విద్యార్థిలానే అల్లు రామలింగయ్య ఎంతో కష్టపడ్డారు. ఎంతో మంది సేవ చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్‌ వంటి సినీ ప్రముఖులు సహా ఎంతోమందికి ఆయన చికిత్స అందించారు. ఓసారి నేను కడుపునొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్సతో దాన్ని పూర్తిగా నయం చేశారు. ఇంతవరకు నాకు మళ్లీ ఆ సమస్య ఎదురుకాలేదు.

అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అల్లు రామలింగయ్య ఎంతో కష్టపడేవారని చిరంజీవి తెలిపారు. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే… మరోవైపు హోమియోపై పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులంతా హోమియో మందులనే వాడతామని తెలిపారు. హోమియోలో మంచి మందులు ఉన్నాయని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/