ఢిల్లీలో నేపాలీ సన్యాసిగా చైనీస్ మహిళ అరెస్ట్

గూడచర్యం కోసమేనని అనుమానాలు

chinese-woman-living-as-nepali-monk-in-delhi

న్యూఢిల్లీ : కట్టూబొట్టూ మార్చి, సాధువు రూపంలో ఢిల్లీలో ఉంటున్న చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్ నుంచి వచ్చానని చెప్పుకుంటూ టిబెట్ శరణార్థుల క్యాంప్ లో ఆశ్రయం పొందుతోంది. అయితే, అధికారుల విచారణలో ఆమె చైనాలో పుట్టిపెరిగిందని, మూడేళ్ల క్రితం భారతదేశానికి వచ్చిందని తేలింది. దీంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

టిబెట్ నుంచి భారత దేశానికి వచ్చిన శరణార్థుల కోసం ఢిల్లీలో మంజు కా టిల్లా పేరుతో ప్రభుత్వం ఓ క్యాంప్ నిర్వహిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ కు సమీపంలో ఉందీ క్యాంప్. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతంగా దీనికి పేరుంది. ఇక్కడ ఉండేవాళ్లను పోలీసులు నిరంతరం ఓ కంట కనిపెడుతుంటారు. ఈ క్రమంలో మంజు కా టిల్లాలో నేపాల్ నుంచి వచ్చిన డోల్మా లామా అనే మహిళ కొంతకాలంగా ఆశ్రయం పొందుతోంది. సాధువు రూపంలో ఉన్న ఈ మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ఆమెను విచారించారు. నేపాల్ లోన్ ఖాట్మండులో తను పుట్టిపెరిగానని చెబుతున్న ఆ మహిళ నిజానికి చైనా పౌరురాలని విచారణలో తేలింది. ఆమె అసలు పేరు కై రుయో అని, 2019లో చైనా నుంచి భారత్ లో అడుగుపెట్టిందని వెల్లడైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. చైనాలోని కమ్యూనిస్టు లీడర్లతో తనకు ప్రాణభయం ఉందని, అందుకే మారుపేరుతో భారత్ లో తలదాచుకుంటున్నానని చెప్పింది. సదరు మహిళకు మాండరిన్ తో పాటు, ఇంగ్లిష్, నేపాలీ భాషలు వచ్చని అధికారులు తెలిపారు. ఆమె గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడిందా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు.