అమెరికా గగనతలంపై చైనా గూఢచారి బెలూన్
వాయవ్య ప్రాంతంలో కీలక అణ్వాయుధ ప్రాంతాలపై సంచారం

వాషింగ్టన్‌ః అమెరికా పైకి చైనా గూఢచర్య బెలూన్లను పంపిస్తోంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ దీనిపై స్పందించింది. అమెరికా గగనతలంపై స్పై బెలూన్ విహరించిందని, అణ్వాయుధాలను ఉంచిన సున్నిత ప్రాంతాలపై నిఘా పెట్టినట్టు సందేహం వ్యక్తం చేసింది. బెలూన్ ను కూల్చివేద్దామని సైనిక ఉన్నతాధికారులు అనుకున్నప్పటికీ.. భూమిపై చాలా మందికి హాని కలిగించొచ్చన్న సందేహంతో ఆ పని చేయలేదని తెలిపింది.
అమెరికాలోని వాయవ్య ప్రాంతాల మీదుగా బెలూన్ వెళ్లిందని, అక్కడ సున్నితమైన ఎయిర్ బేస్, వ్యూహాత్మక క్షిపణులు ఉన్నట్టు పెంటగాన్ పేర్కొంది. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏఎఫ్ పీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వాణిజ్య విమానాలు ప్రయాణం చేసే మార్గం కంటే ఎత్తులో ఈ బెలూన్ వెళుతున్నట్టు తెలిపింది. భూమిపై ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. కాగా, గతంలోనూ చైనా బెలూన్లు అమెరికా మీదుగా వెళ్లాయి.