గాల్వాన్‌ లోయా మాదే.. చైనా

ఇండియా సైన్యం కావాలనే రెచ్చగొడుతోంది..చైనా అధికార ప్రతినిధి లిజియాన్

గాల్వాన్‌ లోయా మాదే.. చైనా
Chinese side makes fresh claim on Galwan Valley

బీజింగ్‌: ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో భారత భూభాగంలోకి ఎవరూ రాలేదని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చైనా విదేశాంగ శాఖ మరోసారి స్పందించింది. భారత్ పై తన అక్కసును వెళ్లగక్కిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్, గాల్వాన్ లోయ తమదేనని మరోసారి వ్యాఖ్యానించి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఆ లోయ, నియంత్రణ రేఖ సమీపంలో చైనా వైపే ఉందని, అది తమదేనని, దాన్ని వదులుకునేది లేదని అన్నారు. భారత సైన్యం, తమ భూ భాగంలోకి అక్రమంగా చొరబడి, రోడ్లు, వంతెనలు నిర్మిస్తోందని ఆరోపించారు.

ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో చైనా పీపుల్స్ ఆర్మీ పెట్రోలింగ్ విధుల్లో ఉందని వ్యాఖ్యానించిన లిజియాన్, భారత సైన్యం, తమను ఏ మాత్రమూ సంప్రదించకుండా, రోడ్లను నిర్మిస్తోందని ఆయన అన్నారు. ఇక్కడ వంతెనలను వారు కట్టారని, ఇతర మౌలిక వసతులను కల్పించుకుంటున్నారని, చాలా సందర్భాల్లో వీటిని అడ్డుకునేందుకు తమ జవాన్లు ప్రయత్నించారని ఆయన అన్నారు. సరిహద్దులను ఇండియా జవాన్లే దాటుతూ, తమను కావాలని రెచ్చగొడుతున్నారని ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/