తైవాన్ జలసంధిపై మిస్సైళ్ల‌ను ప్ర‌యోగించిన చైనా

యుద్ధనౌకలు మోహరించిన అమెరికా

Chinese military conducts precision strikes over Taiwan Strait a day after Pelosi’s visit

బీజింగ్‌ః తైవాన్ స‌మీపంలో చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్ లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం… తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది.

తైవాన్ పర్యటన ముగించుకుని పెలోసీ వెళ్లిపోయిన మరుసటి రోజే చైనా నావికాదళ, వాయుసేన విన్యాసాలు చేపట్టింది. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించింది. తూర్పు తైవాన్ జలసంధిలోని నిర్దేశిత ప్రాంతాలను లక్ష్యాలుగా ఎంచుకుని చైనా లాంగ్ రేంజి ప్రెసిషన్ మిసైళ్లను ప్రయోగించింది. దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ, ఈ విన్యాసాలతో తాము ఆశించిన ప్రయోజనం దక్కిందని వ్యాఖ్యానించింది.

కాగా, చైనా సముద్ర, గగనతల విన్యాసాలు చేపట్టిన కాసేపటికే అనేక అమెరికా యుద్ధనౌకలు ఆ ప్రాంతంలో మోహరించాయి. చైనా ప్రతీకార చర్యలను తాము నిశితంగా గమనిస్తున్నామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితి విషమించకుండా తమ సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/