మయన్మార్లో సైన్యం కాల్పులు..38 మంది మృతి
ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న సైన్యం
Chinese-Financed Factories Set On Fire, 38 Killed In Myanmar
యాంగోన్ : ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చి, పాలనను ఆ దేశ సైన్యం చేతిలోకి తీసుకున్న తర్వాత మయన్మార్ అట్టుడుకుతోంది. సైనిక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలకు దిగుతున్న ప్రజలపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. దొరికినవారిని దొరికినట్టు అరెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంటోంది.
మరో వైపు భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోవడం షాక్ కు గురి చేస్తోంది. మయన్మార్ లోని ప్రధాన నగరమైన హ్లెయింగ్తాయా ఇండస్ట్రియల్ ఏరియాలో చైనా ఫైనాన్స్ చేస్తోన్న ఫ్యాక్టరీలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ సందర్భంగా బలగాలు జరిపిన కాల్పుల్లో 22 మంది చనిపోయారు. ఇతర ప్రాంతాల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ స్థాయిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ ఘటనపై మయన్నార్ లోని చైనా దౌత్యకార్యాలయం స్పందిస్తూ, నిరసనకారుల దాడుల్లో పలువురు చైనా సిబ్బంది గాయపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ప్రజలు, ఆస్తులను మయన్మార్ కాపాడాలని కోరింది. మయన్మార్ ను హస్తగతం చేసుకున్న సైన్యానికి చైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోందని అన్ని దేశాలు భావిస్తున్న సంగతి గమనార్హం.
తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/